అంబ అగస్త్యేశ్వర లింగం – చెన్నూరు

Amba Agastheeshwara Lingam, Chennur

పంచక్రోశ గోదావరి పరిక్రమణ – కాళేశ్వరం – క్షేత్రాలు

← పరిక్రమణ పేజీకి తిరిగి వెళ్ళండి / Back to Parikrama Page
పరిక్రమణ క్రమ సంఖ్య: 16 వర్గం: పంచక్రోశ క్షేత్రం

పరిచయం

తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో గోదావరి నది "పంచక్రోశ ఉత్తరవాహిని" పేరుతో ప్రసిద్ధమై ఉత్తరం వైపు దాదాపు 15 కిలోమీటర్లు ప్రవహిస్తున్నది. ఆ పవిత్ర నది ఒడ్డున శతాబ్దాలుగా ఖ్యాతమై ఉన్న పట్టణమే "చెన్నూరు."

వేదవ్యాస మహర్షి రాసిన పురాణాల్లో ఒకటైన స్కాంద పురాణంలోని సనత్కుమార సంహిత కాళేశ్వర ఖండంలో ఈ ప్రాంతం ప్రస్తావన ఉన్నది. ఇక్కడ అగస్త్య మహర్షి ఘోర తపస్సు చేశాడని, అగస్త్య కుండాన్ని నిర్మించి శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించాడని కాళేశ్వర ఖండం చెపుతున్నది.

కాళేశ్వర ఖండంలో అగస్త్యం

కాళేశ్వర ఖండం 15వ అధ్యాయం 60 నుండి 64 శ్లోకాల్లో సూత మహర్షి మునులతో ఈ ప్రాంతం గురించి వివరించాడు:

అస్తి దేవ్యాశ్చ వాయవ్యా మగస్త్యో భక్తవత్సలః ।
అగస్త్యనిర్మితం దివ్యం రత్నసోపానమండితమ్ ॥ 60 ॥
అగస్త్యస్యోత్తరే దేశే అర్థక్రోశవిదూరతః ॥ 64 ॥

భావం: కాళరాత్రి అమ్మవారి దేవాలయానికి వాయవ్యంలో అగస్త్యం ఉన్నది. అక్కడ భక్తవత్సలుడైన అగస్త్య మహర్షి నిర్మించిన రత్నాల మెట్లు కలిగిన దివ్యమైన కుండం ఉన్నది … (60). అగస్త్యం యొక్క ఉత్తర ప్రాంతంలో అర క్రోసెడు దూరంలో … (64).

సుమారు ఐదు వేల సంవత్సరాలకు పూర్వమే, ద్వాపర యుగం చివరి భాగం మరియు కలియుగ ప్రారంభంలో వ్యాస మహర్షి చేసిన పురాణ సంకలనంలో భాగమైన స్కాంద పురాణంలో ఈ అగస్త్య ప్రాంతం గురించి ఉన్నదంటే దీని గొప్పదనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రస్తుతం "చెన్నూరు" అని పిలువబడుతున్న ఈ ప్రాంతం 5,000 సంవత్సరాలకు పూర్వము నుండి "అగస్త్యం" లేదా "అగస్త్యేశ్వరం" అని (కాళేశ్వరం లాగ) పిలువబడి ఉండొచ్చు.

చెన్నూరు పేరు

ఉత్తరవాహినియై ప్రవహించే గోదావరి నది ఒకవైపు, చుట్టూ పలు రకాల వృక్ష సంపదతో నిండిన అడవులు, వివిధ మృగాలు, పక్షులు, పచ్చని పంట పొలాలతో, సారవంతమైన నేలలతో నిండి, ప్రశాంతమైన వాతావరణంతో యోగసాధన, తపస్సు మొదలైనవి చేసుకునే వారికి అత్యంత అనుకూలమై, అందమైన ప్రకృతితో అలరారుతూ ఆనందాన్నిచ్చే ఈ ప్రాంతానికి కాలాంతరంలో "చెన్నూరు" అన్న పేరు ఏర్పడింది.

"చెన్ను" (chennu) అనే తెలుగు పదానికి, అలాగే కన్నడ పదానికి "అందం" లేదా "ఆనందం" అని అర్థం. చెన్ను + ఊరు = చెన్నూరు అంటే "అందమైన ఊరు," "ఆనందాన్నిచ్చే ఊరు" అని అర్థం.

దాదాపు 1300 సంవత్సరాలకు పూర్వం నుండే చెన్నూరు పేరుతో ఉన్న ఈ ప్రాంతం ఒక అగ్రహారం.

క్రీ.శ. 940 నాటి కన్నడ శాసనం

సామాన్య శకం 940 కాలం నాటి కన్నడంలో ఉన్న దానశిలా శాసనం ఇక్కడ అంబా అగస్త్యేశ్వరాలయంలో లభించడాన్ని బట్టి, అంతకు పూర్వం నుండి అంటే దాదాపుగా సామాన్య శకం 7వ శతాబ్దం నుండే ఈ ప్రాంతంలో రాష్ట్రకూటులు మరియు వేములవాడ చాళుక్యుల ప్రాబల్యం ఉండడం వల్ల ఇక్కడి ప్రజలు తెలుగు మరియు కన్నడ భాషలు ఉపయోగించేవారని అర్థం చేసుకోవచ్చు. ఆ కాలంలోనే ఈ ప్రాంతానికి "చెన్నూరు" అని నామకరణం చేయబడి ఉంటుందని ఒక ఊహ.

అలాగే, (1) ఇండియన్ ఆర్కియాలజీ 1959-60, ఎ రివ్యూ – పేజీ నెం: 53; (2) యాన్యువల్ రిపోర్ట్ ఆన్ ఎపిగ్రఫీ, 1967 – పేజీ నెం: 3, 4, 22, 23 మరియు (3) ఎపిగ్రఫియా తెలంగానికా Vol.1, ప్రి-కాకతీయ తెలంగాణ – పేజీ నెం: 81 ప్రకారం చెన్నూరులోని అంబా అగస్త్యేశ్వరాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఉన్న శిలాశాసనం శక సంవత్సరం 863, శార్వరి నామ సంవత్సరం, శ్రావణ మాసం, శుద్ధ పంచమి అంటే జూలై 12, ఆదివారం, సామాన్య శకం 940 నాడు వేయబడింది. దీనిమీద ఉన్న భాష కన్నడ. దానిలో ఉన్న విషయ సారాంశం:

(కన్నడ భాషలోని ఈ దానశాసనంలో ఉన్నది "చెన్నూరు" అయ్యుంటుందని, కాల ప్రభావం వల్ల అక్షరాల రూపు మారి "ననయూరు" అన్నట్టుగా నాటి శాసన పరిశోధకులకు కనిపించిందేమో అని ఒక అభిప్రాయం.)

కాకతీయుల కాలంలో చెన్నూరు దేశం

ఎపిగ్రఫియా తెలంగానికా Vol.2, ఇంపీరియల్ కాకతీయాస్ – పేజీ నెం: 108 లోని ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ (రీప్రింట్-2016) ప్రకారం సామాన్య శకం 1199 డిసెంబర్ 26వ తేదీన నెలకొల్పబడిన ధర్మపురిలోని తమ్మచెరువు దగ్గరి హనుమంతుని దేవాలయంలో ఉన్న కాకతీయ గణపతిదేవుని శాసనం ప్రకారం ఆ కాలంలో అల్లం ప్రోలరాజు అనే నాయకుడు చెన్నూరు దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ శాసనం ప్రకారం చూస్తే నేడు చెన్నూరుగా ఉన్న ప్రాంతం గణపతిదేవుని కాలంలో "చెన్నూరు దేశం" అన్న పేరుతో ప్రసిద్ధమైనదని తెలుస్తున్నది.

వేద పండితులకు, పురోహితులకు, శాస్త్ర పండితులకు, కవులకు, రచయితలకు, చరిత్రకారులకు, సంగీత కళాకారులకు, పంచాంగకర్తలకు, వివిధ రంగాల కళాకారులకు, ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల నిపుణులకు నిలయమై చెన్నూరు నాటి నుండి నేటికీ ఖ్యాతిని పొందుతున్నది.

యాత్రా సమాచారం

కాళేశ్వరం ఎలా చేరాలి · దర్శన సమయాలు · వసతి · యాత్ర ప్లాన్ చేయండి · అన్ని క్షేత్రాలు

← రామేశ్వర లింగం – గోదావరి రేవు, చెన్నూరు సర్పాకార నరసింహ క్షేత్రం – అక్కిపల్లి →
← పరిక్రమణ పేజీకి తిరిగి వెళ్ళండి / Back to Parikrama Page
💬